శ్రీ దత్తాత్రేయ వైభవం - 8.
5. ఐదవ గురువు - అగ్ని:
అగ్ని సమస్తాన్ని కబళించి ఆహారంగా స్వీకరిస్తుంది. అపవిత్ర పదార్థాలను స్వీకరించినా కానీ తాను మాత్రం పవిత్రంగానే ఉంటుంది. అలాగే మనం కూడా సమస్తమైన ఙ్ఞానాన్ని నేర్చుకోవాలి కానీ మనం అపవిత్రులం కాకూడదు. అగ్ని నుండి ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవాలంటాడు దత్తాత్రేయుడు.
ఙ్ఞాని కూడా అగ్నిలా పవిత్రుడు. ఎలాంటి కల్మషమూ లేని వాడు. ఙ్ఞాని అరిషడ్వర్గాలకు అతీతుడు.
6. ఆరవ గురువు - చంద్రుడు:
చంద్రుడు కృష్ణ పక్షంలో తన కళలు క్షీణిస్తున్నా చల్లటి వెన్నెల వెలుగును ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. అలాగే ఙ్ఞాని కూడా తనకు ఏం జరుగుతున్నా ఇతరులకు మంచి చేసే ప్రయత్నమే చేస్తాడు. మహాత్ములు కూడా గుణంలో చాలా చల్లనివారు.
చంద్రుడు శుక్ల పక్ష, కృష్ణ పక్షాల్లో పెరిగుతూ , క్షీణిస్తున్నా తన అసలు గుణ స్వరూపాలలో మార్పు చెందడు. అలాగే మహాత్ములు కూడా వారు పుట్టినప్పటి నుండి మరణించే వరకు వారి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నా వారి యొక్క సహజ గుణంలో, స్వభావంలో మార్పును రానివ్వరు.
7. ఏడవ గురువు - సూర్యుడు:
సూర్యుడి ప్రతిబింబం ఎన్ని పదార్థాల్లో కనిపించినా సూర్యుడు మాత్రం ఒక్కడే. అలాగే పరమాత్మ కూడా ఎన్ని రూపాల్లో కనిపించినా పరమాత్మ మాత్రం ఒక్కడే. ఇలా సూర్యుడి నుండి చాలా విషయాలు నేర్చుకోవాలంటాడు దత్తాత్రేయుడు.
సూర్యుడు తన వేడిమితో సముద్రాలలో ఉన్న నీటిని ఆవిరి చేసి వర్షం రూపంలో మళ్ళీ ఆ నీటిని భూమికి చేరేటట్టు చేస్తాడు. కానీ ఈ మొత్తం ప్రక్రియలో సూర్యుడు ప్రత్యక్షంగా నీటిని అంటడు కదా. అలాగే మహాత్ములు కూడా మన నుండి ప్రాపంచిక పదార్థాలు స్వీకరించినా. వాటిపై మోజు పెంచుకోక మరల వాటిని ఏదో రూపకంగా మనకే ఇచ్చివేస్తారు.
8. ఎనమిదవ గురువు - పావురం:
దీనికి సంబంధించిన విచిత్రమైన కథ ఒకటి ఉంది. ఒక అడవిలో పావురాల జంట నివసిస్తూ ఉండేది. వాటికి కొంత కాలం తరువాత సంతానంగా రెండు పావురాలు జన్నించాయి. శైశవ దశలో ఉన్న ఆ పావురాల కోసమని ప్రతిరోజూ ఈ పావురాల జంట ఆహారం తీసుకొని వచ్చేవి.
అలా ఒకనాడు పిల్లల కోసం ఆహారం తేవడానికి వెళ్ళిన పావురాల జంట తిరిగి వచ్చెసరికి తమ సంతానం వేటగాడి వలలో ఉండడం చూసి చాలా దుఃఖించాయి. ప్రాణప్రదంగా పెంచుకున్న వాటిని వీడి ఉండలేక ఆ పావురాల జంట కూడా అదే వలలో పడి వేటగాడికి ఆహారంగా మారాయి.
మనిషి కూడా ప్రాపంచిక విషయాలపై బాగా ఆసక్తి పెంచుకొని పరమాత్ముని మార్గం నుండి వైక్లబ్యమును పొందుతారు. మోక్ష మార్గాన్ని విడిచి ఐహిక విషయసుఖాలకై ప్రాకులాడతారు. పుత్రులు, మిత్రులు, భార్య , బంధువులే కాకుండా పరమాత్మ అనేవాడు ఒకడున్నాడనే ధ్యాస కూడా ఉండకుండా ప్రాపంచిక సుఖాలలో మునిగితేలుతూంటాడు. ఆ పావురాల జంట లాగా మనిషి మూర్ఖంగా ప్రవర్తించ కూడదని హితవు పలుకుతాడు దత్తాత్రేయుడు. ఒక్కోసారి మనిషి పుట్టుకతో ఙ్ఞానిగా జన్మించినా పరమాత్మను చేరే మార్గంలో వైక్లబ్యమును పొంది ఆ మార్గం నుండి ప్రక్కకు మరలుతాడు. కానీ అప్పుడు సద్గురువు లేదా ఆ పరమాత్మనే ఆశ్రయించి మోక్ష ప్రాప్తికై ప్రయత్నించాలి.
0 comments :
Post a Comment