శ్రీ దత్తాత్రేయ వైభవం - 11.
17. పదిహేడవ గురువు - చేప:
చేపకు తన మీద తనకు నియంత్రణ లేకపోవటం చేత గాలానికి చిక్కుతుంది. అలాగే చేప తన నివాసమైన నీటిని వదిలి బ్రతకలేదు. అలాగే మనిషికి కూడా తన ఇంద్రియాల మీద నియంత్రణ ఉండాలి. లేకుంటే అనేక చిక్కులలో పడిపోతాడు. అలిగే మనిషి కూడా తన నిజ స్థావరాన్ని వదల కూడదు. తన నిజ రూపాన్ని కూడా మరవకూడదు. అలా మరిస్తే తిప్పలు తప్పవంటాడు దత్తాత్రేయుడు.
18. పద్దెనిమిదవ గురువు - వేశ్య:
దీనికి సంబంధించిన కథ ఒకటి ఉంది. పింగళ అనే పేరు గల ఒక వేశ్య నివసిస్తు ఉండేది. అమె తన వేశ్యా వృత్తి చేత తన దగ్గరకు వచ్చే గ్రాహకుల కోరికలను తీర్చి వారిని సంతృప్తిపరచేది. అలా చాలా కాలం తరువాత పింగళ తన వేశ్యా వృత్తిని వదిలేసి ప్రశాంతంగా భగవన్మార్గంలో బ్రతుకుదామని నిశ్చయించుకుంది. అనుకున్నట్టే అదే ప్రయత్నం చేసి తన వేశ్యా వృత్తిని వదిలి భగవంతుణ్ణి చేరింది.
తన కోసం తను బ్రతకకుండా ఇతరుల శ్రేయస్సుకై బతికేవాడే మహాత్ముడు. సుఖం కోసం పింగళ, పింగళ ఇచ్చే సుఖముకై గ్రాహకుల ఎదురుచూసేవారు. కానీ పింగళ గ్రాహకులను నిజంగా ప్రేమించదు. గ్రాహకులు పింగళను ప్రేమించరు. కానీ ఇద్దరూ కలవగానే ప్రేమ అనే నాటకాన్ని మొదలుపెడతారు. ప్రపంచం ఇలా ప్రేమ నాటకాలు ఆడేవారు ఎంతమంది లేరు.
పింగళ లాగా మనిషి కూడా తన సుఖాలను త్యాగం చేసినప్పుడే బ్రహ్మంనందాన్ని పొందుతాడు. అసలైన సచ్చిదానంద స్వరూపాన్ని చేరతాడు. అలా అన్ని వదిలినప్పుడే అసలైన ప్రశాంతతను పొందుతాడు. ఇక అప్పుడు ఎటువంటి బాధలు, ఇబ్బందులు ఉండవు ఎందుకంటే అన్ని తానే అయినవాడిలో తాను లీనమైపోతాడు కాబట్టి ఇక తనకు తను కాకుండా ప్రపంచంలో ఏమి కనిపించదు. ఇదే అద్వైత తత్త్వం.
19. పంతొమ్మిదవ గురువు - పసిపిల్లవాడు.
పసిపిల్లలు ఎటువంటి కల్మషం లేనివారై శుద్ధమైన, పవిత్రమైన మనస్సు కలిగి ఉంటారు. కల్లాకపటం లేని స్వచ్ఛమైన మనసు కలిగి ఉంటారు వారు కాబట్టి భగవంతునితో సమానులు. వారు సాధుస్వభావులు. ఎవ్వరి మీద కోపం కానీ ద్వేషం కానీ చూపరు. కానీ నేటి మానవుడు అరిషడ్వర్గాలతో పరిపూర్ణుడు.
మనిషి కూడా ఒక పసిపిల్లవాడిలోని మంచి గుణాలును తెలుసుకుని వాటిని ఆచరించే ప్రయత్నం చేయాలి. మన మనస్సు గ్లాసు వంటిది. ఒకవేళ దానిలో మట్టి చేరిన తరువాత దానిలో పాలు పోసినా, నీరు పోసినా లేదా అమృతం పోసినా వ్యర్థమే. అలాగే మన మనస్సు కూడా కల్మషం లేకుండా ఉండాలి. లేకుంటే దానిలో ఎంత ఙ్ఞాన ప్రవాహం జరిగినా వృథాయే. అలా మనస్సుని సాధ్యమైనంత వరకు ఎలాంటి కల్మషముల చేత పాడు కాకుండా చూసుకోవాలి.
ఐహిక విషయాలపై మక్కువ పెంచుకున్నవాడికి ఎంత చెప్పినా వాడికి ఙ్ఞానం అంటదు. ఎందుకంటే వాడికి శ్రద్ధ లేదు కదా. ' శ్రద్ధావాన్ లభతే ఙ్ఞానం ' అంటుంది భగవద్గీత.
ఒకవేళ అలా కల్మషమయమైనా దానిని సద్గురువైన భగవంతుడినే ఆశ్రయించి బాగుచేయాలంటాడు దత్తాత్రేయుడు. అందుకే మనిషికి భక్తి అనేది చాలా ముఖ్యం.
20. ఇరవైయవ గురువు - కన్య:
దీనికి సంబంధించి కూడా ఒక కథ ఉంది. ఒక ఊరిలో పేద దంపతులు ఉండేవారు. వారికి ఒక కుమార్తె ఉండేది. ఒకసారి కొంతమంది వారి ఇంటికి ఆతిథులు రావలసి వచ్చింది. కానీ ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు వ్యవసాయ పనులకై వెళ్ళారు. అతిథుల కోసం అన్నం వండుదామని బియ్యాన్ని చెరగడం మొదలుపెట్టింది.
కానీ అలా చేసేటప్పుడు తన గాజులు బాగా చప్పుడు చేయటం మొదలుపెట్టాయి. కానీ అతిథులకు ఆ శబ్దం వలన ఇబ్బందిగా ఉంటుందేమో అని ఒక్కొక్కటిగా తన గాజులు తీసివేయటం మొదలుపెట్టింది. చివరికి ఒక్కో చేతికి కేవలం ఒకే గాజు మిగిలాయి. అలా మళ్ళీ చెరగడం మొదలు పెట్టాక శబ్దం రావటం ఆగిపోయాయి.
ఆ కథ నుండి మనం ఏం నేర్చుకోవాలంటే, సాధన అనేది ఏకాంతంగా సాగాలి. అప్పుడే మనం చాలా ముందుకు వెళ్ళగలుగుతాం. అనేక తత్త్వాలు లేదా వాదనలు ఓకే చోట ఉండలేవు. చాలా రకాల తత్త్వాలు భోధించే మహాపురుషులు ఒకేచోట ఉండలేరు. వారి భావనలను తప్పని మనం అనలేం. ఎందుకంటే భగవంతుని చేరుటకై అనేకానక మార్గాలున్నాయి. అందుకే మహాత్ములు కేవలం ఏకాంతానికే ప్రాముఖ్యం ఇస్తారు.
మనం ఈ భవబంధాలను కూడా బాగా వంట బట్టిచ్చుకొని వాటి కోసమే పరితపించకూడదు అంటాడు దత్తాత్రేయుడు. వాటికే అత్తుక్కొని ఉండకూడదు. వాటిని పుస్తకాలకు వేసే అట్టలలాగా మాత్రమే ఉంచి తరువాత సమయం వచ్చినప్పుడు వదిలేయాలి. కానీ అలా కాకుండా మనం మాత్రమే వాటినే శాశ్వతం అనుకొని వాటికై పరితపిస్తాము.
దయయుంచి ఈ గ్రంధం రచించివ వారి పేర్లు తెలుపగలరు
ReplyDeleteదయయుంచి ఈ గ్రంధం రచించివ వారి పేర్లు తెలుపగలరు
ReplyDeleteSri Ekkirala Bharadwaja Guruvu Garu is the author
ReplyDelete