దశరథుని నలుగురు కుమారులు అల్లారుముద్దుగా పెరుగుతూ అన్ని విద్యలయందు సాధనగావిస్తూ వున్నారు. వారిని చూసిన దశరథ మహారాజు కౌసల్య, సుమిత్ర కైకేయిల ఆనందానికి అవధులు లేవు. రాముడు నీతిశాస్త్రము, విలువిద్యలు చక్కగా అధ్యయనం చేశాడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులయొక్క శౌర్యము ప్రవర్తన చూచి దశరథుడు ఎంతో సంతోషము చెందుతున్న సమయంలో విశ్వామిత్రుడు దశరథుడిని చూసేందుకు వచ్చెను. బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుణ్ణి దశరథుడు తగు రీతిలో సన్మానించి అతని కోరికను అడిగి తెలిసికొనెను.
బలపరాక్రమములు కలిగినవాడు, విలువిద్యలో నేర్పరి అన్ని అస్త్రములు తెలిసినవాడు, నీతి, ధర్మం ఎరిగినవాడు, బుద్ధిమంతుడు, వీరుడు అయిన రాముడిని లక్ష్మణుడిని తనతో తీసుకుని వెళ్ళుటకు అనుమతివ్వమని విశ్వామిత్రుడు, దశరథుని అడిగాడు. ఎందుకని దశరథుడు ప్రశ్నించగా అడవిలో మునులు చేస్తున్న యాగాలను ధ్వంసం చేస్తున్న రాక్షసులను, క్రూర మృగాలను చంపుటకు అని విశ్వామిత్రుడు చెప్పెను. రాముడిపై వున్న ప్రేమ, మమకారంతో దశరథుడు మొదట ఒప్పుకొనలేదు. తర్వాత విశ్వామిత్రుని ఆగ్రహం చూసి, వశిష్టులవారి సలహామేరకు రామలక్ష్మణులను పంపుటకు దశరథునికి అంగీకరించెను.
ఇక్కడ నుంచి రామలక్ష్మణులను కీర్తిమంతులుగా తీర్చిదిద్దినవాడు విశ్వామిత్రుడు. రామలక్ష్మణులు విశ్వామిత్రునితో బయల్దేరి దారిలో ఎంతోమంది రాక్షసులను సంహరించారు. విశ్వామిత్రుడు వారిరువురికి ఎన్నో శస్త్రవిద్యలను, అస్త్రములను బహూకరించెను. మనం రోజూ తిరుమల కొండపైన వినే సుప్రభాతంలోని ప్రథమ శ్లోకం విశ్వామిత్రుడు రామలక్ష్మణులను నిద్రలేపుటకు వారి కర్తవ్యమును తెలియజేయుటకు చెప్పినదే. ''కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే''...
తాటకి మొదలు రాక్షసులను సంహరిస్తూ ఎంతోమంది కీర్తిమంతులు, ధర్మాత్ములు, ఋషులు, మునులయొక్క చరిత్రలు తెలుసుకుంటూ.. గొప్ప గొప్ప మహర్షులను కలుసుకుంటూ రామలక్ష్మణ విశ్వామిత్రులు మిథిలానగరానికి చేరారు. మిథిలానగరానికి రాజు జనకమహారాజు. అతనికి భూమి దున్నుచుండగా నాగటిచాలు నుండి పుట్టిన కూతురు సీత. విశ్వామిత్రుడు జనకమహారాజుని కలిసి రామలక్ష్మణులను గురించి చెప్పెను.
''వీరివురికి మీ వద్దనున్న శివధనస్సును చూడవలెనని కోరిక కలిగినది. ఆ శివధనుస్సును చూపించినచో దానియొక్క మహత్యమును తెలుసుకుని తిరిగి అయోధ్య వెళ్ళిపోయెదరు'' అని విశ్వామిత్రుడు జనకునితో చెప్పగా, జనకుడు ఆ శివధనుస్సును తీసుకుని రమ్మని భటులను ఆజ్ఞాపించెను. ఎనిమిది చక్రముల బండిపై నున్న ఆ శివధనుస్సును ఐదువేలమంది దీర్ఘకాయులు అంటే భుజభలం ఉన్న పురుషులు జనకుడు వున్న ప్రదేశానికి లాక్కుని వచ్చారు.
శివధనస్సు మహిమను, దాని ప్రాముఖ్యతను రామలక్ష్మణ, విశ్వామిత్రులకు వివరించెను. "ఓ మునిశ్రేష్ఠా! మిక్కిలి ప్రకాశించుచు ఆ శివధనస్సును రాముడు ఎక్కుపెట్టగలిగినచో, అయోనిజ యగు సీతను రామునికి ఇచ్చి వివాహము జరిపించెదను'' అని విశ్వామిత్రునితో జనకుడు పలికెను. విశ్వామిత్రుని ఆజ్ఞ ప్రకారం రాముడు ఆ ధనుస్సును మధ్యయందు పట్టుకొనెను. వేలకొలది జనులు చూచుచుండగా రాముడు ఆ ధనస్సును అనాయసముగా ఎక్కుపెట్టెను. రాముడు ఆ ధనుస్సును ఎక్కుపెట్టి, నారిని ఆకర్ణాంతములాగగా అది విరిగిపోయెను.
జనకుడు, దశరథ మహారాజునకు కబురు పంపి వారి అనుమతితో వారి కుటుంబ సభ్యులందరి సమక్షమున సీతారాముల కల్యాణం ఎంతో ఘనంగా జరిపించాడు. జనకుని మొదటి కుమార్తె సీతను రామునకు, రెండవకుమార్తె అయిన ఊర్మిళను లక్ష్మణునకు, జనకుని తమ్ముడు కుజధ్వజుడి కుమార్తెలు మాండవిని భరతునకు ఇంకొక కుమార్తె శ్రుతకీర్తిని శత్రఘ్నునికి ఇచ్చి వివాహము జరిపెను. వివాహానంతరం అందరూ కలిసి మిథిలను వదిలి అయోధ్య పట్టణానికి చేరారు.
సీతకి మాయలు మంత్రాలు తెలియవు. యుద్ధం చేయలేదు. భూమినుండి జన్మించి జనకమహారాజు భవనములో అల్లారు ముద్దుగా పెరిగిన ఒక స్త్రీ అంత గొప్ప పతివ్రత ఎలా అయ్యింది. పతివ్రత అంటే భర్త తప్ప పరాయి మగవాడిని మనస్సులో కూడా తలవని స్త్రీ అని అర్థమైతే ఇప్పటి సమాజంలో కూడా అటువంటి వారు చాలామంది వున్నారు. పోనీ కట్టుకున్న భర్తను కంటికి రెప్పలా చూసుకుంటూ అతనికి అన్ని సేవలు చేసే స్త్రీ అని అనుకుంటే అటువంటివారు ఇప్పుడూ వున్నారు. మరి సీతలోని ప్రత్యేక గుణము ఏమిటి అని పరిశీలిస్తే సీత ఒక రాజవంశములో పెరిగిన అమ్మాయి. చిన్నప్పటినుంచి చాలా గారాబంగా పెరిగింది. ఏది కావాలంటే అది సమకూర్చగల తండ్రి. శివధనుస్సును అవలీలగా పక్కకునెట్టిన శక్తివంతురాలు కాలు కిందమోపితే కందిపోతుందేమో అన్నంత సున్నితంగా జనకమహారాజు పెంచాడు.
అంత సున్నితంగా పెరిగిన సీత, స్వయంవరంలో శివధనుస్సును విరిచిన పరాక్రమవంతుడైన రాముని వివాహమాడింది. అందరి ఆడపిల్లలలాగేనే సీత వివాహానంతరం రామునితో అత్తగారింటికి అయోధ్యకు వచ్చింది. పుట్టినిల్లు, మెట్టినిల్లు చాలా సంపన్నమైనవి. ఇరు కుటుంబాల వారు మహారాజులు. సీతకు ఎక్కడా కొరత లేదు. ప్రేమగా చూసుకునే అత్తమామలు. తన అక్కచెల్లెళ్లే తోడికోడళ్ళు. తల్లిలా చూసుకునే బావమరుదులు. ఇంతకన్నా గొప్ప అదృష్టం ఏ స్త్రీకి కలుగుతుంది?
కానీ ఆ తల్లి సీతమ్మ పడ్డ కష్టాలు ఏ స్త్రీ కూడా అనుభవించి ఉండదు. అసలు అన్ని కష్టాలు సీత ఎందుకు అనుభవించింది. కైకేయి పదునాలుగు సంవత్సరాలు వనవాసానికి పోవలసిందిగా రాముడిని కోరింది కానీ, సీతమ్మను రాముడితో పోవాలని కోరలేదు. మరి సీత ఎందుకు రాముడితో అడవులకు వెళ్ళింది. కేవలం పదునాలుగు సంవత్సరాలు రాజభవనములో సుఖాలను అనుభవిస్తూ గడిపేస్తే రాముడు తిరిగివచ్చేవాడు కదా! అలా అయితే రామాయణం కథ వుండేది కాదు.
ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే సాధారణంగా మధ్య తరగతి లేదా బీద కుటుంబాలలో జన్మించిన స్త్రీలలో ఓర్పు, సహనం ఎక్కువగా ఉంటుంది. తన కుటుంబ పరిస్థితులు ఎలా వున్నా, తన భర్త గుణగణాలు ఎలావున్నా.. సంసారాన్ని రచ్చకీడ్చకుండా చాలా గుట్టుగా ఓర్పుగా చక్కదిద్దుకునే మనస్తత్వం కలిగి వుంటారు. కానీ కొన్ని సంపన్న కుటుంబాలలో భార్యాభర్తల మధ్య సంబంధము ఎక్కువగా ధనంతో ముడిపడి వుంటుంది. వారి మధ్య అవగాహనకానీ, సర్దుకుపోయే తత్త్వం కానీ ఉండకపోవచ్చు. సుఖాన్ని కలిసి పంచుకున్నా కష్టాలని పంచుకోవడానికి ఏ వ్యక్తీ ఇష్టపడడు. అహం అనేది ప్రతి వ్యక్తికీ ఎంతో కొంత అడ్డుపడుతూ వుంటుంది. సాధారణ మనస్తత్వం కలిగిన మనుష్యులున్న నేటి సమాజంలో, నేను నా భర్తతోనే వుంటాను. కష్టమైనా సుఖమైనా ఇద్దరం కలిసే జీవిస్తాము. ఒకరిపై ఒకరు నిందవేసుకోకుండా అన్యోన్యముగా ఆనందముగా జీవిస్తాము అనుకునే ప్రతి స్త్రీ నిజంగా పతివ్రతే.
రాముడు ఎంత చెప్పినా, ఎన్ని రకాలైన ఉదాహరణలతో వివరించినా.. ఎంత భయపెట్టినా.. ఆ మాటలను లెక్కచెయ్యక అతనితో పాటు అడవులకు ప్రయాణమైనదంటే సీతమ్మతల్లికి భర్తపట్ల ఎంత ప్రేమానురాగాలు ఉన్నాయో తెలుస్తుంది. (2-28,11). వాల్మీకి రామాయణంలో అడవికి వెళ్ళేముందు రాముడికి సీతకు మధ్య జరిగిన సంవాదము చాలా గొప్పగా వుంటుంది.
0 comments :
Post a Comment