Enjoy cooking
Browse through over
650,000 tasty recipes.
Home » » కార్తీక పురాణం-7

కార్తీక పురాణం-7

కార్తీక పురాణము 7వ అధ్యాయము (శివ కేశవార్చనా విధులు)

వశిష్ఠులవారు జనకున కింకనూ యిటుల బోధించిరి. "రాజా! కార్తీకమాసము - గురించి, దాని మాహాత్మ్యము గురించి యెంత వినిననూ తనివితీరదు. ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి యింట లక్ష్మీదేవి స్థిరముగా నుండును. తులసీదళము లతో గాని బిల్వపత్రములతో గాని సహస్ర నామపూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును. కార్తీకమాసమందు ఉసిరిచెట్టుక్రింద సాలగ్రామ ముంచి భక్తితో పూజించిన యెడల వారికి కలుగుమోక్ష మింతింతకాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరిచెట్టు క్రింద భోజనము పెట్టి తాను తినిన, సర్వపాపములు పోవును. ఈ విధముగా కార్తీకస్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం యే గుడికైననూ వెళ్లి భక్తితో సాష్టాంగ నమస్కారములైననూ చేసినయెడల వారి పాపములు నశించును. సంపత్తిగలవారు శివకేశవుల ఆలయములకు వెళ్లి భక్తితో దేవతార్చన, హోమాదులు, దానధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయేగాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠప్రాప్తి కలుగును. శివాలయమున గాని, విష్ణ్యాలయమునగాని జండా ప్రతిష్టించినచో యమకింకరులు దగ్గరకు రాలేరు సరికదా, పెనుగాలికి ధూళిరాసు లెగిరిపోయినట్లు కోటి పాపములైనను పటాపంచలై పోవును. ఈ కార్తీక మాసములో తులసికోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంఖుచక్ర ఆకారముల ముగ్గులు పెట్టి,నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిదనుంచి నిండా నువ్వుల నూనెపోసి, వత్తినివేసి వెలిగించవలెను. ఈ దీపము రాత్రింబవళ్లు ఆరకుండా ఉండవలెను. దీనినే నందా దీపమందురు. ఈ విధముగా జేసి, నైవేద్యమిడి కార్తీకపురాణము చదువుచుండిన యెడల హరిహరులు సంతసించి కైవల్య మొసంగెదరు. అటులనే కార్తీకమాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్చించిన ఆయుర్ వృద్ధి కలుగును. సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసీదళములతో పూజించవలెను. ఏ మనుజుడు ధనము బలము కలిగియూ కార్తీక మాసమందు పూజాదులు సలపడో ఆ మానవుడు మరుజన్మలో శునకమై తిండి దొరకక యింటింట తిరిగి కఱ్ఱలతో దెబ్బలు తింటూ నీచస్థితిలో చచ్చును. కావున కార్తీకమాసము నెలరోజులూ పూజలు చేయలేనివారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించిననూ మాసఫలము కలుగును. కనుక ఓ రాజా! నీవు కూడా యీ వ్రతమాచరించి తరింపుము యని చెప్పెను.

"నమశ్శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం

నాగేంద్రకన్యా వృష కేతనాభ్యాం నమో నమ శ్శంకర పార్వతీభ్యాం"

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి సప్తమాధ్యాయము యధ్యాయము
                                సప్తమదిన పారాయణము సమాప్తము.

SHARE

About Unknown

0 comments :

Post a Comment