కాశీ (వారణాసి) గురించి శివుడు బ్రాహ్మణులకు వివరించుట:
"వారణాసి భక్తులు నా భక్తులే. కాశీలోని ఏ చిన్న జంతువుతో విరోధము పెట్టుకున్ననూ వారు ఈ భూమిపైన నాతో సహా అంతటినీ విరోధముగా చూచినట్లే. కాశీలో నివశించేవారు నా అంతఃకరణమున నివశించినట్టే. కాశీకి వచ్చికూడా నన్ను ఎవడు సేవించడో వాడి చేతికి వచ్చిన మోక్షలక్ష్మి జారిపోయినట్లే. ముక్తికాంక్ష కలవారు ఉత్తరవాహిని అయిన గంగను సేవించాలి. ప్రతి నిత్యము లింగాన్ని అర్చించాలి. దమము, దానము, దయ ఈ మూడింటిని పాటించాలి. క్షేత్రవాసులైన వారికి ఒక రహస్యము చెప్పుచున్నాను. ఇతరులు కొరకై బుద్ధిని ఉపయోగించాలి. ఉద్వేగకరమైన మాటలు ఆడరాదు. మనస్సున కూడా పాపాన్ని ఆచరించరాదు. ఇక్కడ ఒక మంచి పని చేస్తే 'కోటి' చేసినట్లు, ఒక పాపం చేస్తే కోటి పాపాలు చేసినట్టు. ఇతరచోట్ల చేసిన పాపము కాశీలో నశిస్తుంది. కాశీలో చేసిన పాపము కోటి కల్పాలు గడిచిననూ పోదు. పాపాత్ముడైనవాడు కాశీ యందు మరణించిన నరకానికి వెళ్ళడు. నా అనుగ్రహముతో పరాంగతిని పొందగలడు.
వేలాది జన్మలయందు చేసిన పాపములు కాశీ క్షేత్రమును ప్రవేశించగానే క్షయించిపోతాయి. కాశీ వచ్చి లింగాన్ని ఎవరు స్ధాపిస్తారో వారికి కల్పకోటి శతాలు గడిచిననూ మళ్ళీ జన్మ లేదు. గ్రహనక్షత్రాదులు కాలాంతరాన పతనమవుతాయి, కాశీ యందు మరణించిన వారికి మాత్రము పతనముండదు. ఇక్కడ మరణ సమయమున స్వయముగా నేనే "తారక మంత్రము"ను ఉపదేశిస్తాను. నాయందు మనస్సు కలవాడై, నా భక్తుడై నాకు అన్ని కర్మలను సమర్పించినవాడు కాశీ యందు మోక్షము పొందినట్టు మరెక్కడా పొందలేడు. అసుఖరూపిణి అయిన మరణము ఆసన్నమైనదని తెలుసుకుని కాశీని ఆశ్రయించాలి.
ఇక్కడ యోగము, జ్ఞానము, ముక్తి అనునవి ఒకే జన్మలో దొరుకుతాయి. వేరే తీర్ధములయందు కోటి గొవులను దానము చేసిన ఫలము ఒకే ఒక్క రోజు కాశీలో నివశించిన వస్తుంది. ఈ రెంటిలో కాశీ వాసమే శ్రేష్ఠమైనది. వేరొకచోట కోటి బ్రాహ్మణులకు భోజనము పెట్టిన పుణ్యము కాశీలో ఒక్క బ్రాహ్మణునికి పెట్టిన కలుగుతుంది. సూర్యగ్రహణ కాలమున కురుక్షేత్రమునందు తులాపురుషదాన ఫలము కాశీలో ఒక భిక్షతో సమానము.
ఈ క్షేత్రమున నన్నెవడు తాకి దర్శించి స్పృశిస్తాడో వాడికి "తారక జ్ఞానాన్ని" ఇస్తాను, మళ్లీ జన్మించడు. నన్ను ఇక్కడ అర్చించి ఎక్కడైనా మరణించిన జన్మాంతరాన నన్ను పొంది విముక్తుడవుతాడు" అని శివుడు బ్రాహ్మణులకు తెలియచేసాడు.
(స్కంద పురాణములోని కాశీఖండము 64వ అధ్యాయము)
0 comments :
Post a Comment